ఆరోజుల్లోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసిన బి.సరోజాదేవి!
on Jan 6, 2026
(జనవరి 7 బి.సరోజాదేవి జయంతి సందర్భంగా..)
హీరోయిన్ అంటే అందం, అభినయం ఉండాలి. చక్కని నాట్యం ప్రదర్శించాలి. ఇవన్నీ ఉంటేనే నటిగా రాణించగలుగుతారు. ఈ లక్షణాలన్నీ ఉన్న హీరోయిన్‌గా ఆరోజుల్లో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు బి.సరోజాదేవి. తండ్రి బైరప్ప ఒక పోలీస్ ఉన్నతాధికారి. ఆయనకు కళలపట్ల ఎంతో మక్కువ. అందుకే కుమార్తె సరోజాదేవికి చిన్నప్పటి నుంచే నాట్యం నేర్పించారు. ఆమెను మంచి నటిగా చూడాలన్నది తండ్రి కోరిక. కానీ, సరోజాదేవికి సినిమా నటి అవ్వాలన్న ఆలోచన లేదు. పెద్దయ్యాక టీచర్ అవ్వాలని కలలు కనేది.
తల్లిదండ్రుల బలవంతం మీద కన్నడలో నిర్మించిన మహాకవి కాళదాస చిత్రంలో తొలిసారి నటించారు సరోజాదేవి. ఆ తర్వాత మరో రెండు, మూడు సినిమాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు. అలా ఆమెకు నటనపై ఆసక్తి కలిగింది. సినిమా నటిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మొదట కన్నడ, ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించిన సరోజాదేవి.. తెలుగులో నటించిన మొదటి సినిమా పెళ్లిసందడి. అయితే ఎన్టీఆర్ నిర్మించిన పాండురంగమహత్మ్యం ముందుగా రిలీజ్ అయింది.
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఆమె హీరోయిన్‌గా బిజీ అయిపోయారు. 1950 దశకంలో అన్ని భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత ఆమెకే దక్కింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె ముద్దు ముద్దు మాటలు ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. ఆరోజుల్లో కొందరు అమ్మాయిలు సరోజాదేవిని అనుకరిస్తూ మాట్లాడేవారు. అంతేకాదు, ఆమె ధరించే చీరలు, బ్లౌజులు, జ్యూయలరీ.. వంటి విషయాలను అప్పటి అమ్మాయిలు అనుకరించేవారు.
తమిళ్‌లో ఎం.జి.ఆర్.తో 26 సినిమాల్లో, శివాజీ గణేశన్‌తో 22 సినిమాల్లో నటించారు. కన్నడలో రాజ్‌కుమార్, ఉదయ్‌కుమార్, కళ్యాణ్‌కుమార్‌లతో, హిందీలో దిలీప్‌కుమార్, షమ్మీ కపూర్, సునీల్‌దత్, రాజేంద్రకుమార్ వంటి టాప్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు సరోజాదేవి. ఆరోజుల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న దక్షిణాది హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమెను ఆంధ్రా క్లియోపాత్రాగా, ఆంధ్రా ఎలిజిబెత్ టేలర్‌గా పిలిచేవారు. పదేళ్ళపాటు నాలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సరోజాదేవి తన కెరీర్‌లో మొత్తం 200 సినిమాల్లో నటించారు. వాటిలో హీరోయిన్‌గా నటించిన సినిమాలు 161. ఇంత పెద్ద సంఖ్యలో హీరోయిన్‌గా నటించిన వారు ఆరోజుల్లో ఎవరూ లేరు. అలా అన్ని విషయాల్లోనూ ఏ హీరోయిన్ కూడా సాధించని రికార్డులను బి.సరోజాదేవి సాధించారు.
తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకున్నారు బి.సరోజాదేవి. వ్యకిగత విషయాలకు వస్తే.. 1967 మార్చి 1న వ్యాపార వేత్త శ్రీహర్షతో బి.సరోజాదేవి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, గౌతమ్ రామచంద్ర. 1986లో భర్త శ్రీహర్ష గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత 1997లో పెద్ద కుమార్తె భువనేశ్వరి కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు.
సరోజాదేవి అందుకున్న పురస్కారాల గురించి చెప్పాలంటే.. సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను 1969లో పద్మశ్రీతోనూ, 1992లో పద్మభూషణ్‌తోనూ సరోజాదేవిని సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇవికాక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక అవార్డులు ఆమెను వరించాయి. బెంగళూరు యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్‌నిచ్చి గౌరవించింది. కొంతకాలం ఆరోగ్య సమస్యలతో బాధపడిన బి.సరోజాదేవి.. 2025 జూలై 14న తుదిశ్వాస విడిచారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



